Price: Rs.100.00 /-
No.Pages: 192.
సాధారణంగా ఏదైన సమస్య మీద ఉద్యమానికి పూనుకున్నప్పుడు ఆ సమస్యకు సంబంధించిన తక్షణ అంశాలవరకే పరిమితమవడం జరుగుతుంది. అవగాహన కూడా అంతవరకే ఉంటుంది. కాని మా గిరిజన సంఘం ఈ ఉద్యమాలు, ఆందోళన సందర్భంగా ఆ సమస్యలను లోతుగా అధ్యయనం చేయడనికి పూనుకున్నది. అలాంటి విస్తృతమైన అవగాహనను కార్యకర్తలకు కలిగించడం ద్వారా మరింత సమర్థవంతంగా, మరింత నిబద్ధతతో పనిచేసే నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం జరిగింది. ఈ కృషిలో గిరిజన సంస్కృతి, రాష్ట్రంలో గిరిజనులు – సమస్యలు పరిశోధన సంస్థలో డైరెక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేసిన డా. విఎన్‌వికె. శాస్త్రి గారి పాత్ర ఎంతో కీలకమైనది. గిరిజనుల ప్రగతి పట్ల చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసిన అధికారి ఆయన. గిరిజన సమస్యలపై అపారమైన అధ్యయనం, ప్రత్యక్ష పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన. మేము కోరిన వెంటనే ఆయన మా కృషి ప్రాధాన్యతను గుర్తించి గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్యరంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్‌ప్లాన్ అమలు- ఇలా ప్రతి అంశంపైన అప్పటికప్పుడు చిన్న పుస్తకాలను రచించి అందించారు. వీటిని కరపత్రాలు అనడనికి వీలులేదు. ఎందువల్లనంటే చారిత్రకంగా ఆ సమస్య తీరుతెన్నులు, అలాగే ప్రస్తుత పరిస్థితి రెండూ వాటిలో కలగలిసి ఉంటాయి. అందుచేతనే వాటన్నింటిని కలిపి ఓ పుస్తకంగా తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది గిరిజనుల చారిత్రక పరిస్థితి గురించి చాలా పుస్తకాలు వచ్చాయి.అలాగే ప్రస్తుత సమస్యలపై కూడ కొన్ని రచనలు వచ్చాయి. కాని గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.