Price: Rs.140.00 /-
No.Pages: 468.
ఇప్పుడున్న సమాజంలో స్త్రీల కేమైనా సమస్యలున్నాయా లేవా; ఉంటే అవి ఏమిటి; ఈనాడు స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి; అవి ఎలా మారాలి - అనే విషయాలు స్త్రీ పురుషులకు తెల్పడమే ఈ నవల ఉద్దేశ్యం. జీవితాల్లో కష్టాల్నీ అవమానాల్నీ పోగొట్టి, సుఖసంతోషాల్నీ, ఆత్మగౌరవాన్నీ ఇవ్వగలిగేది - సరైన జ్ఞానం. న్యాయాన్ని సమానత్వాన్నీ ఇవ్వగలిగేదే సరైన జ్ఞానం! బాధల్ని చెక్కు చెదరనివ్వకుండా వుంచేదీ, పరిస్థితుల్ని మార్చలేనిది తప్పుడు జ్ఞానమే. అందుకే స్త్రీలందరికీ, తమ జీవితాలకు సంబంధించిన అసలు జ్ఞానం తెలియాలి. కానీ, స్త్రీల సమస్యలు, స్త్రీల జీవితాలకే పరిమితం కాదు. అవి పురుషుల జీవితాలకు సంబంధంలేని విషయాలు కావు. స్త్రీ జీవితం, పురుషుడి జీవితం కూడా! స్త్రీకి సుఖ సంతోషాలు లేని చోట, అవి పురుషుడికీ వుండవు. స్త్రీల సమస్యల మీద స్త్రీలకు సరైన జ్ఞానం కలగడం ఎంత అవసరమో, పురుషులకు సరైన జ్ఞానం కలగడం కూడా అంత అవసరమే. స్త్రీ పురుషులకు, ఒకరితో ఒకరికి సంబంధాల్లేని వేరు వేరు జీవితాలు లేవు. ఇద్దరిదీ ఒకే జీవితం. సమస్యల పట్ల సరైన జ్ఞానమూ, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సరైన కార్యక్రమమూ, ఎవరి చేతుల్లో వుంటాయో వాళ్ళే ఆ సమస్యల్ని పరిష్కరించగలరు. వాళ్ళే ఈ సమాజాన్ని మార్చగలరు. అలా కాని వాళ్ళ వల్ల ఆ పని ఎన్నటికీ జరగదు. సమస్యల్లో వుండే వ్యక్తి, తన జ్ఞానం (తన భావాలు, తన ఆలోచనా విధానం, తన చైతన్యం) సరైన మార్గంలో వుండేలాగ చూసుకోవాలి. తన జ్ఞానాభివృద్ధికీ, తన జీవితాభివృద్ధికీ, వ్యక్తిగతంగా తను చేసుకోవలసినదంతా చేసుకోవాలి. మార్క్సిజం ఇచ్చే జ్ఞానమే లేకపోతే, 'జానకి విముక్తి' లేదు. ఏ స్త్రీ విముక్తీ వుండదు.