Price: Rs.70.00 /-
No.Pages: 136.
ఒకరోజు సౌదామిని కుంజ్‌బిహారీమోహన్ మందిరాన్ని దాటి మెట్లు దిగి రహస్యమైన లోకంలోకి ప్రవేశిస్తుండగా, మందిరానికి చెందిన ‘నింబార్క్’ సంప్రదాయం గల సాధువు ఒకరు అడ్డుతగిలి “నువ్వు ఈ ప్రాంతానికి అపరిచితురాల్లా ఉన్నావు. నువ్వు అటువైపు వెళ్లకపోవడమే మంచిది” అన్నాడు. బాల్కనీలో మంచంపైన పడివుంటూ ముఖ్య సందర్భాలలో మృదంగం వాయించే ఆ సాధువు మాటలు సౌదామినిలో మరింత కుతూహలాన్ని పెంచాయి. సాధువుకి ప్రణామం చేస్తూ సౌదామిని “ఈ వ్రజభూమిలోని అణువణువూ నాకు ఉత్కంఠ గొలిపే విషయమే” అంది. మురికాగా ఉన్న పురాతన మెట్లమీద నుంచి కిందకి దిగింది సౌదామిని. నాచుపట్టి సగానికిపైగా ఆవరించిన చెక్కలతో పాడుబడిన బావి కనిపించింది. అక్కడే పెచ్చులూడిన చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఈ గదుల్లో ఎందరో రాధేశ్యామీలు ఉన్నారు. అస్థిపంజరం లాంటి వాళ్ల శరీరాలపైన మాసి పేలికలైన ధోవతులు చుట్టి ఉన్నాయి. అయినా వాళ్ల నుదుటిపైన గోపీచందనం, విభూతిరేఖలు ప్రకాశిస్తున్నాయి. సౌదామినిని చూడగానే ఆ వృద్ధస్త్రీలు గదుల్లోంచి బయటికి వచ్చి ఆమెని చుట్టుముట్టారు. “అమ్మ! మీరంతా ఇక్కడ ఎలా బతుకుతున్నారు?” అడిగింది సౌదామిని.